Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : పువ్వాడ అజయ్

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం సభా ఏర్పాట్లను పరిశీలించడానికి నెలకు రూ. 5 కోట్ల భారీ అద్దెతో కొత్త హెలికాప్టర్లను వాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలాసాలకు పోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మధిరలో ట్యాంక్ బండ్, సెంట్రల్ లైటింగ్, అంతర్గత రోడ్లతో పాటు చింతకాని మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 3,500 దళిత కుటుంబాలకు ‘దళిత బంధు’ ద్వారా రూ. 10 లక్షల చొప్పున అందించి నిజమైన అభివృద్ధి చేశామని గుర్తుచేశారు.

​గత కేసీఆర్ పాలనలో ఎలాంటి హడావుడి లేకుండా రైతుల ఖాతాల్లో ‘టంగ్ టంగ్’ మంటూ నేరుగా రైతుబంధు నిధులు జమ అయ్యేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాను తగ్గించి, ఎకరాల వారీగా ముక్కలు ముక్కలుగా ఇస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 9 నాటికే రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి 80 శాతం మంది రైతులకు అన్యాయం చేశారని, మధిర నియోజకవర్గంలో ఏ గ్రామాల్లోనైనా 100 శాతం రుణమాఫీ జరిగిందా అని భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.

​నాయకుల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోయినా పార్టీ ప్రతిష్ట కోసం నిరంతరం శ్రమిస్తున్న గులాబీ కార్యకర్తల పోరాట పటిమను ఆయన కొనియాడారు. ప్రస్తుత చేతకాని ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, క్యాలెండర్లు మారినట్లే రోజులు మారుతాయని, రాబోయే రోజుల్లో మధిర గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ కార్యకర్తలకు తామంతా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కేళ్లపల్లి రవీందర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>