కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి బడ్జెట్ను (Bengal Budget) ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా సోమవారం ఈ బడ్జెట్ను సమర్పించారు. అనంతరం పలు సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భారీ ఉద్యోగ నియామకాలతో కూడిన కీలక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా 21 నుంచి 45 ఏండ్ల నిరుద్యోగుల కోసం భరోసా పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఉద్యోగం లేని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000, గ్రాడ్యుయేట్లు కానివారికి నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కోసం రూ.550 కోట్లు కేటాయించారు. అలాగే ‘అన్నపూర్ణ యోజన’ ఆర్థిక సహాయ పథకం కోసం రూ.36,000 కోట్లు కేటాయించారు. అవివాహిత మహిళలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ఒకేసారి రూ.50,000 చొప్పున గ్రాంట్ అందజేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా బడ్జెట్లో (Bengal Budget) భారీ కేటాయింపులు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా 20,000 పోలీస్ ఉద్యోగాలు, 50,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్లను మంత్రి ప్రకటించారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 1 లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని, అందులో 33 శాతం మహిళలకే కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.

