కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 87వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ లతో కలిసి ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. సుభాష్ నగర్ లోని ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ.. బలమైన, ఐక్యమైన, స్వయం సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించాలనే మహా సంకల్పంతో క్రాంతి వీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ‘ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్’ నేటికి 87 వసంతాలు పూర్తి చేసుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు.
పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం..
రాబోయే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గడిచిన 87 ఏళ్లుగా AIFB పార్టీ జాతీయవాదం, సామాజిక న్యాయం, లౌకికవాదం మరియు సామాన్య ప్రజల సాధికారత కోసం, ప్రజల హక్కుల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతోందని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదవాడికి అందినప్పుడే నేతాజీ కలలుగన్న నిజమైన భారతదేశం సాకారమవుతుందని స్పష్టం చేశారు.
యువత ఏకం కావాలి..
సమాజంలో ఉన్న అసమానతలపై, అన్యాయాలపై ప్రశ్నించే తత్వమే నేతాజీ మార్గమని, కుల మత బేధాలకు అతీతంగా ప్రగతిశీల నవ భారత నిర్మాణం కోసం యువత అంతా ఏకమై భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, బద్రినేత, AISB విద్యార్థి సంఘం నాయకులు అతికం రాజశేఖర్ గౌడ్, గూడా కిష్టయ్య, రాహుల్ , సజ్జు, సాగర్ బాబాన్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

