కలం, కరీంనగర్ బ్యూరో : పోలీస్ అధికారులు, సిబ్బంది విధులలో మరింత సమర్థవంతంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యం అత్యంత అవసరమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న జిల్లా 3వ పోలీస్ డ్యూటీ మీట్–2026 (Police Duty Meet 2026) కార్యక్రమాన్ని ఎస్పీ, అదనపు ఎస్పీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణ వంటి అంశాలలో పోలీసు సిబ్బంది నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ఫోరెన్సిక్ సాంకేతికతలు, నేర పరిశోధనలో అనుసరించాల్సిన ఉత్తమ విధానాలపై అవగాహన పెంపొందించేందుకు డ్యూటీ మీట్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.
పోలీసు శాఖలో ప్రతి అధికారి, సిబ్బంది చట్టాలపై సంపూర్ణ అవగాహనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. నేరస్థులను శాస్త్రీయ ఆధారాలతో న్యాయస్థానంలో దోషులుగా నిరూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అత్యంత అవసరమని అన్నారు. ఈ డ్యూటీ మీట్‌లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్స్, యాంటీ-సబోటేజ్ చెకింగ్ వంటి విభాగాలతో పాటు కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం లభిస్తుందని, జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌లో విజేతలకు విశేష గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య సమన్వయం, సహకారం, వృత్తిపరమైన అనుభవాల మార్పిడి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, సుధాకర్, కరుణాకర్, రవి, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, వేణు, ఎస్.ఐలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

