కలం, నిర్మల్ : ఊరంటే మమకారం, పుట్టిన నేలపై ప్రేమ ఉంటే అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చని మరోసారి నిరూపించారు సాకెరా (Sakera) గ్రామస్థులు. గ్రామంలో రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీధి దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలంలోని సాకెరా గ్రామం జాతీయ రహదారి 44 నుండి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంది. గ్రామంలోని ప్రధాన రహదారిపై చాలాకాలంగా సరైన వెలుతురు లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గుర్తించిన గ్రామానికి చెందిన సక్కాని భవాని (శంకర్) తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వంత ఖర్చులతో దాదాపు అర కిలోమీటర్ మేర స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ దీపాలను ప్రారంభించగా, గ్రామ ప్రధాన రహదారి మొత్తం వెలుగులతో కళకళలాడింది. ఈ స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వల్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా గ్రామానికి స్వాగత తోరణం ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్న సక్కాని భవాని (శంకర్), మరోసారి గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

