కలం, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేవడానికి అలారం పెట్టుకోవడం దగ్గరనుంచి, రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా చూడటం వరకు ప్రతి దానికి ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. ఇలా మన జీవితంలో అంతర్భాగమైన స్మార్ట్ ఫోన్ కు కూడా ఒక ‘ఎక్స్‌పైరీ డేట్’ (Smartphone Expiry Date) ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఫోన్ స్క్రీన్, బ్యాటరీ బాగున్నా, కంపెనీ ఇచ్చే సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇలా ఆగిపోతే అది టెక్ భాషలో ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) కిందకు వస్తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఫోన్లను వాడటం వల్ల మన పర్సనల్ డేటా, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
‘ఎండ్ ఆఫ్ లైఫ్’ అంటే ఏమిటి?
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తాము తయారు చేసే ఫోన్‌లకు నిర్ణీత కాలం పాటు ‘ఆపరేటింగ్ సిస్టమ్’ (OS) అప్‌డేట్స్, ‘సెక్యూరిటీ ప్యాచ్’లను అందిస్తాయి. అయితే కంపెనీలు ఈ అప్‌డేట్స్ ఇవ్వడం ఆపేసిన రోజునే ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ అంటారు. సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆగిపోతే, ఫోన్‌లోని భద్రతా లోపాలను సరిచేసే అవకాశం ఉండదట. తద్వారా హ్యాకర్లు సులభంగా మీ ఫోన్‌ను హ్యాక్ చేసి, మీ డేటాను దొంగిలించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
మన ఫోన్ ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు అయిపోతుందో తెలుసుకోవడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు.
1. endoflife.date వెబ్‌సైట్: ఈ వెబ్ సైట్ ద్వారా మన ఫోన్ ఎక్స్ పైరీ డేట్ గురించి తెలుసుకోవచ్చు. దీని కోసం బ్రౌజర్‌లో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ ఫోన్ బ్రాండ్, మోడల్ పేరును సెర్చ్ చేయాలి. అక్కడ మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ముగిసే ఖచ్చితమైన తేదీ కనిపిస్తుందట.
2. Google Search: గూగుల్‌లో మీ “మొబైల్ మోడల్ పేరు + end of software support” అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ వివరాలు లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
స్మార్ట్‌ఫోన్‌కు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ రావడం ఆగిపోయినప్పుడు, మీ డేటా, అకౌంట్లు సురక్షితంగా ఉండటానికి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ పేమెంట్స్ చేయొద్దు.
2. ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఆర్థిక లావాదేవీలు చేయడం పూర్తిగా మానేయాలి.
స్మార్ట్ నిర్ణయం ఎలా తీసుకోవాలి?
సాధారణంగా మనం కొత్త ఫోన్లను కొనేటప్పుడు డిజైన్, కెమెరాపైనే దృష్టి పెడతాం. కానీ మీరు భవిష్యత్తులో కొత్త ఫోన్ కొనేటప్పుడు కేవలం డిజైన్, కెమెరాపైనే కాకుండా, ఆ కంపెనీ ఎన్ని ఏళ్లపాటు అప్‌డేట్స్ ఇస్తుందనే విషయాన్ని గమనించడం ముఖ్యం. ప్రస్తుతం గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు కొన్ని మోడల్స్‌కు ఏకంగా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ఇస్తున్నాయి. కాబట్టి, ఫోన్ కొనేముందే అప్‌డేట్ పాలసీని చెక్ చేసుకోవడం ఒక స్మార్ట్ కొనుగోలుదారుని లక్షణమని చెబుతున్నారు టెక్ నిపుణులు. మీ ఫోన్ డేటాను సురక్షితంగా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫోన్‌ను వాడుకోవడమే ఏకైక పరిష్కారం అని సూచిస్తున్నారు.

