Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణకు ‘ఉపాధి’ గండం!

కలం, తెలంగాణ బ్యూరో : ఇంతకాలం అమలైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ జీ-రామ్-జీ (VB G RAM G) (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ) రాష్ట్ర ప్రభుత్వానికి సరికొత్త చిక్కులు తెచ్చింది. దీన్ని అమలు చేసినా, చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనున్నది. అమలు చేస్తే 40% మ్యాచింగ్ గ్రాంట్‌ను సమకూర్చాలి. అమలు చేయకుంటే ఆల్టర్నేట్‌గా ప్రభుత్వమే 100% ఫండింగ్ చేసుకోవాలి. మరోవైపు ఉపాధి హామీ పనులపై ఆధారపడుతున్న లక్షలాది పేద కుటుంబాలకు ఎలాంటి ప్రత్యామ్నాయం కల్పించాలన్నది సమస్యాత్మకంగా మారింది. కేంద్రం తెచ్చిన కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తయ్యేంత వరకు పాత స్కీమ్ ప్రకారమే ఫండింగ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

కొత్త చట్టంతో కేంద్రానికి ఫాయిదా..

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 2006 ఫిబ్రవరి 2న ఉమ్మడి ఏపీలోని అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా అమలవుతున్న ఈ స్కీమ్ మరికొన్ని రోజుల్లో చరిత్ర కాలగర్భంలో కలిసిపోనున్నది. దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ-రామ్-జీ’ స్కీమ్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నది. భారత గ్రామీణాభివృద్ధికి ఈ కొత్త చట్టం కొత్త శకం అని మోదీ సర్కార్ అభివర్ణిస్తున్నా.. పలు రాష్ట్రాల్లో దీనిపై వ్యతిరేకత వస్తున్నది. కేంద్రం తన వాటాను తగ్గించుకుని రాష్ట్రాలపై భారం వేయడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుపడుతున్నాయి. కొత్త స్కీమ్‌తో ఆర్థికంగా, రాజకీయంగా కొత్త సవాళ్లను విసిరినట్లయింది. పాత చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% ఆర్థిక బాధ్యతను భరించింది. రాష్ట్రాల వాటా పరిమితం. కానీ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ఉపాధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. కేంద్రం 60% భరిస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ కొత్త నిబంధనమే ఆందోళన కలిగిస్తున్నది. కొత్త చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఏటా రూ. 2,550 కోట్లు ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

వ్యవసాయ సీజన్లో పనులు బంద్

కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ సీజన్ సమయంలో రెండు నెలల పాటు ఉపాధి హామీ పనులకు విరామం ఇవ్వాలనే తప్పనిసరి నిబంధన వచ్చింది. దీంతో ఆ అరవై రోజుల పాటు కూలీలకు ‘ఉపాధి’ పనులు లభించవు. ఎక్కువగా పేదలే ఉపాధి పథకంతో లబ్ధిపొందుతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యేందుకే ఈ నిబంధన పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తే పేదలకు ఉపాధికి గ్యారంటీ ఉంటుందని అంటున్నాయి. కానీ, స్పెషల్‌గా వ్యవసాయ సీజన్లోనే కొత్త ఉపాధి ద్వారా పనులు బంద్ పెట్టడం ఆందోళనకు దారితీసింది. ఉపాధి హామీనే నమ్ముకుని బతికే పేదలకు ఆ 60 రోజుల సమయంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా పనులు చూపించక తప్పదు. పాత చట్టంలో ఏడాదిలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ ఉండగా.. కొత్త చట్టంలో దాన్ని 125 రోజులకు పెంచారు. అయితే.. వ్యవసాయ సీజన్లో 60 రోజులు బంద్ పెట్టాలన్న తప్పనసరి రూల్ సంకటంగా మారింది. ‘‘కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం విధించడంతో భూమిలేని పేదలకు తీరని నష్టం జరుగుతుంది. కొత్త చట్టంలో భూమి ఆధార పనులు తొలగించడం అన్యాయం. తొలగించిన పనులన్నీ కొనసాగించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి.. జనవరి 3న అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కొత్త చట్టాన్ని అడాప్ట్ చేసుకోకపోతే..

కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవడంపై ఈ నెలాఖరుకల్లా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. వచ్చే నెల 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. అడాప్ట్ చేసుకున్నట్లయితే చట్టంలోని నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను భరించాల్సి వస్తుంది. అడాప్ట్ చేసుకోనట్లయితే పేదలకు ఉపాధి కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. అడాప్ట్ చేసుకోకపోతే కేంద్రం నుంచి అందే 60% గ్రాంట్లు ఆగిపోతాయి. అంటే ఏటా రూ. 3,825 కోట్లు బంద్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు ఉపాధిని కల్పించడంతో పాటు 100% ఫండింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త చట్టాన్ని అమలు చేస్తే ఒక రకమైన తిప్పలు.. అమలు చేయకపోతే రెట్టింపు తిప్పలు.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయమే కీలకం. అవసరమైతే రాష్ట్రం ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకుంటుందని మంత్రి సీతక్క ఇటీవల వ్యాఖ్యానించారు. పేద కుటుంబాలకు ఉపాధి హామీ కల్పించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ఆర్థిక భారంతో సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులకు ఇబ్బందులు పడుతున్నది. అప్పులపై ఆధారపడుతున్నది. ఇప్పుడు కొత్త ఉపాధి చట్టాన్ని అమలు చేస్తే సంవత్సరానికి కనీసంగా రూ. 2,550 కోట్లను కేటాయించక తప్పదు. దాదాపు రెండు రైతు భరోసా నిధుల ఖర్చుకు ఇది సమం. ఇంతకాలం లేని అదనపు భారాన్ని మోయడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. దీన్ని తప్పించుకోడానికి కొత్త చట్టాన్ని అడాప్ట్ చేసుకోనట్లయితే.. లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధిని కల్పించడం మరో రకమైన చిక్కులు తెచ్చిపెట్టనుంది. కొత్త స్కీమ్ను తెచ్చి మొత్తం ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. అది మరింత ఆర్థిక భారం కానుంది. రాష్ట్రంలో ఏటా సుమారు 25 లక్షల కుటుంబాలు గ్రామీణ ఉపాధి హామీ పొందుతున్నాయి. కొత్త చట్టాన్ని అడాప్ట్ చేసుకోని పక్షంలో ముఖ్యంగా ఆదివాసీ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించక తప్పదు. వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు, కరువు పరిస్థితులు ఉన్నప్పుడు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయి.

నాలుగు రెట్లు ఎక్కువ

– జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ కింద రాష్ట్రంలో ఏటా లబ్ధిపొందుతున్న కుటుంబాలు 25 లక్షలు. ఈ స్కీమ్‌ను 2006లో ఉమ్మడి ఏపీ నుంచి అప్పటి మన్మోహన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. స్కీమ్‌కు కేంద్రం 90% నిధులు కేటాయిస్తుంటే.. రాష్ట్రం వాటా 10 శాతం.
– జులై 1 నుంచి అమలు కానున్న జీ రామ్ జీ పథకంతో కేంద్రం ఖర్చు చేసే నిధుల వాటా 60 శాతమే. రాష్ట్రం వాటా 40 శాతం. కొత్త చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటే ఏడాదికి రాష్ట్రం రూ. 2,550 కోట్లు భరించాలి. పాత స్కీమ్‌తో పోలిస్తే.. కొత్త దానివల్ల 4 రెట్లు ఎక్కువగా రాష్ట్ర ఖర్చు చేయాలి.
– ఒకవేళ కొత్త చట్టాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతే.. కేంద్రం నుంచి రావాల్సిన 60 శాతం (రూ.3,825 కోట్లు) నిధులు ఆగిపోతాయి. దానికి తోడు రాష్ట్రమే ఆల్టర్నేట్‌గా కూలీలకు ఉపాధి చూపించాల్సి ఉంటుంది. ఈ ఆల్టర్నేట్ కోసం రాష్ట్ర సర్కారే పూర్తి నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ప్రతి ఏటా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఖర్చు

ఆర్థిక సంవత్సరం వ్యయం
2014-15     2,038
2015-16     2,393
2016-17     2,626
2017-18     2,930
2018-19     3,028
2019-20     2,733
2020-21     4,544
2021-22     4,671
2022-23     3,443
2023-24     4,076
2024-25     4,345
2025-26     2,341

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>