కలం, ఖమ్మం బ్యూరో: బోటిగూడెం, బందగిరినగర్ గ్రామాలకు చెందిన గిరిజన పోడు రైతుల సమస్యపై పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateswarlu) తక్షణమే స్పందించారు. అటవీ అధికారులు తమను వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించి, గిరిజనులకు తానున్నానంటూ కొండంత భరోసా కల్పించారు.
గత కొంతకాలంగా బోటిగూడెం, బందగిరినగర్ గ్రామాల్లోని సుమారు 45 గిరిజన కుటుంబాలు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. అయితే, ఇటీవల అటవీశాఖ అధికారులు వారి వ్యవసాయ పనులను అడ్డుకోవడంతో స్థానిక గిరిజన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఏకైక జీవనాధారమైన భూములను కాపాడుకోవాలనే ఆవేదనతో రైతులంతా కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
గిరిజన రైతుల ఆవేదనను విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, సంబంధిత అటవీశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అటవీ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆయా భూముల్లో మళ్లీ సమగ్ర సర్వే నిర్వహించాలని, అర్హులైన గిరిజన రైతుల భూములను వారికే అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం గిరిజన రైతులను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ సమస్యను రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే గిరిజనులందరికీ శాశ్వత పరిష్కారం చూపే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్య విన్న వెంటనే స్పందించి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు (Payam Venkateswarlu) గిరిజన రైతులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
Read Also: ఫోటో వివాదం.. ట్రంప్‌కి మెలోని కౌంటర్
Follow Us On: Instagram

