Mobile Popup Ad
Mobile Popup Ad

ఫార్ములా వన్ సరికొత్త రికార్డు.. కార్బన్ ఉద్గారాలు చెక్ !

కలం, వెబ్ డెస్క్ : ఫార్ములా వన్ (Formula 1) పర్యావరణ పరిరక్షణలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2030 నాటికి పర్యావరణానికి హాని చేయని ‘నెట్-జీరో’ క్రీడగా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే బుధవారం విడుదల చేసిన 2025 నివేదిక ప్రకారం.. 2018తో పోలిస్తే ఎఫ్-1 తన మొత్తం కార్బన్ ఉద్గారాలను 35 శాతం తగ్గించుకుంది. గత 2024 ఏడాదితో పోల్చినా ఈసారి ఉద్గారాల్లో 12 శాతం తగ్గుదల నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట విస్తరిస్తున్నా ఉద్గారాలు తగ్గడం విశేషం.

ముఖ్యంగా ప్రయాణాల వల్ల వచ్చే ఉద్గారాలు 2018 నుండి 27 శాతం తగ్గాయి. ఇందుకోసం జట్లు పర్యావరణహిత విమాన ఇంధనాన్ని వాడుతున్నాయి. అలాగే సిబ్బంది ప్రయాణాలను తగ్గించేందుకు రిమోట్ బ్రాడ్‌కాస్ట్ పద్ధతులను విస్తరించారు. ఈ ఉమ్మడి ప్రయత్నాల వల్ల 2018 నుండి దాదాపు 80 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది 22 గ్రాండ్ ప్రి రేసులను నిర్వహించాలని ఫార్ములా వన్ యోచిస్తోంది. రేసుల మధ్య కార్గో రవాణా ఉద్గారాలను తగ్గించే పనిలో పడింది. 2030 నాటికి సగానికి పైగా బ్రాడ్‌కాస్ట్, కార్గో రవాణాను విమానాల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేసింగ్ క్యాలెండర్‌ను సరిగ్గా ప్లాన్ చేయడం, ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడటం వల్లనే ఈ మార్పు సాధ్యమైందని ఫార్ములా వన్ ప్రెసిడెంట్, సీఈఓ స్టెఫానో డొమెనికాలి హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>