Mobile Popup Ad
Mobile Popup Ad

పెండింగ్ కేసులు ఉండొద్దు: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బుధవారం కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం సుదీర్ఘంగా జరిగింది. కమిషనరేట్ పరిధిలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు, విభాగాధిపతులు పాల్గొని తమ పరిధిలోని కేసుల డైరీలను సీపీకి సమర్పించి కేసుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, తీవ్రమైన నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. మహిళా పోలీస్ సిబ్బందికి ‘బ్లూ కోల్ట్స్’ విధులను కేటాయించాలని, ‘షీ టీమ్స్’ ద్వారా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలని స్పష్టం చేశారు.

నగరంలో ముమ్మర తనిఖీలు..

కరీంనగర్‌లో ‘విజిబుల్ పోలీసింగ్’ స్పష్టంగా కనిపించాలని సీపీ ఆదేశించారు. రాత్రి పగలు పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి, వారి ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేసి మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నేపాలీ కార్మికుల వివరాల నమోదు..

ఇటీవల జరిగిన నేపాలీ ముఠాల ఘటనలను దృష్టిలో ఉంచుకుని, వారిపై నిఘా పెట్టాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ చోట్ల పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా ఉన్న నేపాలీ కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. హోటళ్లు, లాడ్జీల్లో సరైన గుర్తింపు కార్డులు, ఫోన్ నెంబర్లు సరిచూసుకున్న తర్వాతే గదులు ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యాంకులు, జ్యువలరీ వ్యాపార సంస్థల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి భద్రతా ప్రమాణాలపై తగు సూచనలు చేయాలన్నారు.

తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు..

కమిషనరేట్ వ్యాప్తంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యం, టింటెడ్ గ్లాస్, పాఠశాల విద్యార్థుల రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సీపీ ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, పాత కెమెరాల జియో-ట్యాగింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం కోర్టు అధికారులతో నిర్వహించిన సమీక్షలో 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీపడే కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, విజయకుమార్, వెంకటస్వామి,యాదగిరిస్వామి మాధవి, ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>