మగ్గం మెరుగులు.. మహిళల బతుకుల్లో వెలుగులు!

​కలం, ఖమ్మం బ్యూరో: సూది దారంతో అల్లే మగ్గం మెరుగులు గ్రామీణ మహిళల బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన 35 రోజుల మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. రాజేంద్రనగర్ (హైదరాబాద్) లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (BIRD) ఆర్థిక సహకారంతో, ‘ఐ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​గత నెల అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణలో 60 మంది నిరుద్యోగ మహిళలు, గృహిణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 35 రోజుల పాటు సాగిన ఈ తరగతులలో మగ్గం వర్క్‌కు సంబంధించిన వివిధ రకాల ఆధునిక డిజైన్లు, ఎంబ్రాయిడరీ పనులు, వస్త్రాల అలంకరణ మరియు చేతివృత్తి నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ అందించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 60 మంది మహిళలకు ముగింపు వేడుకల్లో భాగంగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ​

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు తమలోని ప్రతిభను వెలికితీసి, నేర్చుకున్న మగ్గం వర్క్ నైపుణ్యాలను వృత్తిగా మలచుకోవడం ద్వారా ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు గ్రామీణ సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారిని స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. ​ఈ కార్యక్రమంలో బర్డ్ (BIRD) సంస్థ హైదరాబాద్ ప్రతినిధి, ఐ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీకాంత్, రామానుజవరం గ్రామ సర్పంచ్ కల్పన, మాజీ సర్పంచ్ బాడీష సతీష్, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>