కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ (Nirmal) రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో ఆదివారం ఉదయం పిడుగుపాటు విషాదం చోటుచేసుకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా గ్రామ శివారులో చెట్టు కింద ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆరు పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామ శివారులో ఎప్పటిలాగే పశువులను చెట్టు కింద ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. పిడుగుపాటు ధాటికి నరేష్‌కు చెందిన రెండు పశువులు, భీమన్న, చిన్నబాపు, మోహన్, రాజేశ్వర్‌కు చెందిన ఒక్కో పశువు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత పశుపోషకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పశువుల మృతితో సుమారు రూ. 6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. తమ కుటుంబాలకు పశువులే జీవనాధారమని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పశువుల మృతికి సంబంధించిన వివరాలను సేకరించారు.

