కలం, వెబ్ డెస్క్: నేపాల్(Nepal)లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాదింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవేపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారు ఏ దేశానికి చెందినవారన్నది ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మరొక ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య 18కి చేరింది. గాయపడిన వారిని రక్షించి సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం రాజధానికి పంపించారు. బస్సు పోఖరా నుంచి ఖాట్మాండు వైపు వెళ్తుండగా డ్రైవర్‌కు అదుపు తప్పి త్రిశూలి నదిలో పడిపోయింది.
ఈ ఘటన సుమారు తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 12 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడం వల్ల రక్షణ చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భద్రతా సిబ్బంది స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


