కలం, వెబ్ డెస్క్: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(TTD) సీఎం చంద్రబాబు రాజకీయాలకు వేదికగా మార్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) విమర్శించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu)పై వస్తున్న ఆరోపణలపై జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంకమైన వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి కానీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
ఒక మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు లేఖ రాసి ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, అతడినే టీటీడీ చైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారని జగన్ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు భక్తి లేదని, దేవుడి పట్ల భయం కూడా లేదని జగన్ ఎద్దేవా చేశారు. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు అదే నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, నెయ్యి క్వాలిటీ బాగా లేదని చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి వచ్చాయన్నారు. అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని సీబీఐ, సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరి మీదకు నెట్టి, మళ్లీ దాని మీద రాజకీయ దుమారం రేపుతున్నాడని ఆరోపించారు.
Read Also: గుంటూరు మిర్చిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్!
Follow Us On: Sharechat

