కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam), శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై సీపీఎం చేసిన పోరాటం వల్లే బాధితులకు తాత్కాలిక విజయం దక్కిందని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ తెలిపారు. ఖమ్మం అయ్యప్ప స్వామి గుడి వద్ద శనివారం బాధితులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు శాశ్వత నివాస హక్కులు దక్కేవరకు అటు కోర్టులోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ పోరాడతామని స్పష్టం చేశారు.
మిగతా పార్టీలు ఓట్ల కోసమే కంటితుడుపు ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. పేదల పక్షాన నిజాయితీగా నిలిచేది కేవలం ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం, కలెక్టర్, స్థానిక మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, బాధితులు పాల్గొన్నారు.

