బ్రహ్మోస్ ప్రాజెక్టుతో దేవరకద్ర అభివృద్ధి: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టుతో దేవరకద్ర నియోజకవర్గానికి రావడంతో ఈ ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు కానుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) అన్నారు. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భూములు కోల్పోతున్న రైతుల కుటుంబాలతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో బసవాయిపల్లి, చౌదర్ పల్లి, జినుగురాళ్ల గ్రామాల రైతులతో భూసేకరణ సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు.

న్యాయమైన పరిహారం కావాలి..

ఈ సందర్భంగా అధికారులు రైతులతో మాట్లాడి పరిహారంపై వారి అభిప్రాయాలు, భూములకు ఆశిస్తున్న ధర, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సమస్యలు, సందేహాలు, సూచనలు తెలుసుకున్నారు. బ్రహ్మోస్ వంటి ప్రాజెక్ట్ తమ ప్రాంతానికి రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని, అయితే న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ పరిహారంతో పాటు భూముల్లో ఉన్న బోర్లు, చెట్లు, షెడ్లు, కాంపౌండ్ గోడలు, ఇతర నిర్మాణాలను సంబంధిత అధికారులు సర్వే చేసి, అంచనా ప్రకారం నిబంధనల మేరకు అదనపు పరిహారం అందిస్తారని తెలిపారు.

75 శాతం మంది అంగీకారం..

కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. మార్కెట్ విలువకు అదనంగా పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతుల అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు.ఇప్పటికే 75 శాతం మంది రైతులు సమ్మతి తెలిపారని అన్నారు. ప్రభుత్వ పరిహారం, భూసేకరణ చట్టం ప్రకారం లభించే పరిహారం, ఇతర ప్రాంతాల్లో అమలైన పరిహారాలను పరిశీలించి రైతులు నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. న్యాయపరమైన ప్రక్రియకు వెళితే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, ఆర్డీవో నవీన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>