యాదాద్రిలో ‘చక్రం’ తిప్పుతూ తిష్ట

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Yadagirigutta Temple)లో కొందరు అధికారుల వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ, ధార్మిక సంస్థల్లో పారదర్శకత పెంచేందుకు, అవినీతికి తావులేకుండా చూసేందుకు ‘రొటేషన్’ విధానాన్ని అమలు చేస్తుంటారు. అయితే యాదాద్రి దేవస్థానం (వైటీడీఏఏ)లో మాత్రం ఈ నిబంధనలను బొందపెడుతూ, కొందరు అధికారులు సంవత్సరాల తరబడి ఒకే విభాగంలో, కీలక పదవుల్లో పాతుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మూడేళ్లకోసారి బదిలీ కావాల్సి ఉన్నా..

భక్తులతో నేరుగా సంబంధం ఉండే రిసెప్షన్, వసతి గదుల కేటాయింపు, ప్రోటోకాల్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ వంటి విభాగాల్లో పనిచేసే అధికారులు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఇలాంటి కీలక పోస్టుల్లోనే కొందరు అధికారులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లకోసారి తప్పనిసరిగా ఇతర శాఖలకు బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ, యాదాద్రిలో మాత్రం ఈ నిబంధన ఎందుకు అమలు కావడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది.

నిబంధనలు సామాన్యులకేనా?

కీలక విభాగాల అధికారులకు ‘బదిలీ’ నిబంధన వర్తించకపోవడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. బదిలీ అనేది ఉద్యోగులపై వేసే శిక్ష కాదు. అది పారదర్శకత, జవాబుదారీతనం పెంచే సాధారణ ప్రక్రియ. ఒక వ్యక్తి ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల వ్యక్తిగత ప్రభావాలు పెరిగి, వ్యవస్థ బలహీనపడే ప్రమాదముంది. పైగా యాదాద్రి క్షేత్రంలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో వైటీడీఏ యంత్రాంగం స్పందించి దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సమగ్ర సమీక్ష అవసరం..

సదరు అధికారులు వైటీడీఏలో ఎప్పుడు చేరారు? ఎంతకాలంగా ఒకే విభాగంలో పనిచేస్తున్నారు? వారిని ఏ నిబంధన ప్రకారం కొనసాగిస్తున్నారు? పొడగింపులు ఇచ్చి ఉంటే దానికి గల పరిపాలనా కారణాలేమిటి? ఈ వివరాలను బహిర్గతం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దేవస్థాన యాజమాన్యం సమగ్ర సమీక్ష నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరుతున్నారు. కొండపై ‘పలుకుబడి’ కాదు, నియమ నిబంధనలకే ప్రాధాన్యం ఉండాలన్నదే భక్తుల ఆకాంక్ష. పోస్టింగ్ అనేది హక్కు కాదు.. భక్తులకు చేసే సేవగా భావించినప్పుడే క్షేత్ర మహిమ, వ్యవస్థ గౌరవం నిలబడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పలుకుబడి ఉంటే బదిలీలకు బ్రేక్?

• యాదాద్రిలో కీలక పోస్టు దక్కితే చాలు.. అదే ప్రాంతంలో మరో బాధ్యత, ఆ తర్వాత ఇంకో పోస్టు అంటూ స్థానచలనం లేకుండా కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
• కొందరు అధికారులు తమకున్న రాజకీయ అండదండలు, పరిపాలనా స్థాయి పరిచయాలను వాడుకుని బదిలీ ఉత్తర్వులకు బ్రేక్ వేయించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
• అలాగే ఉన్నతాధికారుల వద్ద తమ పలుకుబడిని పెంచుకుని, వ్యక్తిగత విధేయత చూపడం ద్వారా పదవులను కాపాడుకుంటున్నారనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.
• నిజంగా పనితీరు ఆధారంగానే ఎవరైనా అధికారిని కొనసాగించాల్సి వస్తే.. అందుకు సంబంధించిన పరిపాలనా కారణాలను రికార్డుల్లో స్పష్టంగా పేర్కొనాలి. కానీ అలాంటి ఆధారాలేమీ లేకుండా వరుసగా పొడిగింపులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>