కలం, వెబ్ డెస్క్: బ్రిక్స్ సదస్సు (BRICS Summit) నిర్వహణకు దేశ రాజధాని రెడీ అయింది. శనివారం, ఆదివారం జరగబోయే ఈ సదస్సుకు సుమారు 30 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రష్యా, చైనా అధ్యక్షులతో సహా 11 మంది దేశాధినేతలు రాబోతుండటంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల పాటు గగనతలం మీద పూర్తి స్థాయి ఆంక్షలు అమలు చేయబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రేపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రానున్నారు. ఏడేళ్ల తరువాత జిన్ పింగ్ భారత్ పర్యటనకు వస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు.. సెలవులు
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజధాని పరిధిలోని అన్ని రకాల స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సదస్సు జరగబోయే భారత్ మండపం సహా చుట్టు పక్కల కొన్ని కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దేశాధినేతలు బస చేస్తున్న ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

