ఎల్‌నినోపై అలర్ట్.. శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

కలం, పెద్దపల్లి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ ఎల్‌నినో(Super El Nino) పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమష్టిగా కార్యాచరణ చేపట్టాలని.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, డీసీపీ రాంరెడ్డిలతో కలిసి వర్షాభావం, ఎల్‌నినో పరిస్థితులు, తాగునీరు, విద్యుత్, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

పంటల సరళిలో మార్పులు తప్పనిసరి

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని, ఎస్ఆర్‌ఎస్‌పితో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న యాసంగి సీజన్‌లో వరి సాగును నివారించి, తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి

‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేయాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు ముందుగా తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రానున్న ఏడాది పాటు ఏ ఒక్క ఆవాసానికి తాగునీటి ఎద్దడి రాకుండా మిషన్ భగీరథ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రజల్లో నీటి పొదుపుపై చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత

నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను పక్కాగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేటు మార్కెట్లలో రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరికి బదులు మొక్కజొన్న, శనగ ఉత్తమం: విజయరమణ రావు

బోరుబావుల కింద వరి సాగు చేసి భూగర్భ జలాలను తోడేయడం కంటే, తక్కువ నీటితో పండే మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం 12 గంటల విద్యుత్ అందిస్తున్నప్పటికీ, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించారు.

తీవ్రంగా పడిపోయిన భూగర్భ జలాలు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరాలు వెల్లడిస్తూ.. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో వర్షాభావం వల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం సగటున 5.31 మీటర్లకు పడిపోయిందని తెలిపారు. ఎల్లంపల్లిలో 17.62 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నందున తాగునీటికి ఇబ్బంది లేదని వివరించారు. అయితే, యాసంగిలో సుమారు 90 వేల ఎకరాలు బీడుగా మారే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గోదాముల్లో ధాన్యం నిల్వల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఖరీఫ్ ధాన్యం మద్దతు ధరకు సంబంధించి సన్న రకాలకు రూ.500 అదనపు బోనస్ అంశంతో పాటు ‘సీతమ్మ లోది’ ట్రెక్కింగ్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>