కలం, ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని తక్కెళ్లపాడు (Takkellapadu) గ్రామపంచాయతీ రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును సాధించింది. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తక్కెళ్లపాడు సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి పాల్గొనగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన వీఓ బిల్డింగ్స్, షెడ్డు, గోడౌన్ నిర్మాణ పనులను తక్కెళ్లపాడు పంచాయతీలో రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేశారు. రాష్ట్రంలోనే ముందుగా పనులు పూర్తి చేసిన సర్పంచ్‌గా ముక్కర రామకృష్ణారెడ్డి నిలవడం పట్ల ప్రభుత్వ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి, తక్కెళ్లపాడు సర్పంచ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సీతక్క మిగతా సర్పంచ్ లకు సూచించారు.
నిబద్ధతతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తే ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని, సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం తమ గ్రామ అభివృద్ధికి అండగా నిలిచిందని తెలిపారు. పనులు పూర్తి చేసిన కేవలం 15 రోజుల్లోనే బిల్లులన్నీ తమ ఖాతాలో జమ అయినట్లు ఆయన వెల్లడించారు.
ఇలా గ్రామ అభివృద్ధి ద్వారా రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం తక్కెళ్లపాడు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని సర్పంచ్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో మండలానికి, గ్రామానికి పేరు తెచ్చిన సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డిని స్థానిక ప్రజలు, నాయకులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.

