సీఎం రేవంత్‌కు కొండా సురేఖ రాఖీ?

కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఈసారి రాఖీ కడతారా? అందుకు సీఎం అపాయింట్మెంట్‌ ఇస్తారా? ఇవ్వకున్నా వెళ్లి కట్టి తీరుతానంటూ సన్నిహితులకు ఆమె సంకేతాలిచ్చారా?.. వంటి ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వినిపిస్తున్నది. ఏటా రాఖీ పండగ రోజున సీఎంను కలిసి మంత్రి కొండా సురేఖ రాఖీ కడుతారు. అయితే, ఈసారి ఆమె కుమార్తె సుష్మిత వ్యాఖ్యలతో వివాదం నెలకొనడంతో.. సురేఖ వెళ్తారో.. వెళ్లరో.. సీఎం టైమ్ ఇస్తారో.. లేదో.. అనే సందేహాలు నెలకొన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ ఈ వివాదాన్ని లైట్‌గా తీసుకున్నారు. సీఎం టైమ్ ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్లి రాఖీ కడతానంటూ తన సన్నిహితులతో మాట్లాడినట్లు తెలిసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి సీతక్కకు సీఎంవో అధికారులు టైమ్ ఇచ్చినట్లు చెప్తున్నా.. మంత్రి కొండా సురేఖ విషయంలో మాత్రం ‘నో’ సమాధానాన్ని ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం పార్టీలో నెలకొన్న క్రమశిక్షణా చర్యల హడావిడిలో మంత్రి కొండా సురేఖ రాఖీ వ్యవహారం సరికొత్త చర్చకు దారితీసింది.

స‌స్పెన్ష‌న్‌పై సస్పెన్స్

– వైఎస్సార్‌ అభిమానిగా ముద్రపడిన మంత్రి కొండా సురేఖపై ఆయన వర్ధంతి (సెప్టెంబర్ 2) వరకు చర్యలు తీసుకునే అవకాశాలు లేవని ఏఐసీసీ వర్గాల సమాచారం. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడంతో పాటు.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ నుంచి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీసినట్లు తెలిసింది.
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో దాదాపు ముప్పావు గంట సమావేశమైన ఖర్గే.. మంత్రి కొండా సురేఖతో పాటు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. ఏ చర్య తీసుకున్నా రాష్ట్రంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
– మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 31 తర్వాత భారత్‌కు చేరుకోనున్నందున.. అప్పటి వరకు వీరిద్దరిపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నది. వచ్చే నెల 7న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అప్పటిలోగా హైకమాండ్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయన్నది కీలకం.

సుమంత్ వ్యవహారంతోనే తలనొప్పి

కొండా సురేఖపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆమెను మంత్రివర్గం నుంచి మాత్రమే తప్పిస్తారని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశం లేదన్న వాదన వినిపిస్తున్నది. మంత్రికి గతంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌ వ్యవహారంలో పార్టీ ఇప్పటికే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. ఆయనను పదవి నుంచి తొలగించింది. కొన్ని పరిశ్రమల నుంచి అక్రమ పద్ధతుల్లో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సుమంత్‌పై ఆరోపణలు రావడం, ఓ మంత్రి సైతం వాటిని ధ్రువీకరించడం, ఈ అంశాన్ని క్రమశిక్షణా కమిటీ తన నివేదికలో ప్రస్తావించడం గమనార్హం.

– ఇంత జరిగినప్పటికీ సుమంత్‌ మంత్రితోనే కొనసాగుతూ ఉండటం.. ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ సీరియస్‌గా తీసుకోవడం లేదని, ప్రభుత్వ ఆదేశాలను ఆమె ధిక్కరిస్తున్నారనే అభిప్రాయానికి కారణమైంది. ఇటీవల ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఘటనపై అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఏ-1గా చేర్చారు. అయితే ఆయన పరారీలో ఉండటంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆయన డ్రైవర్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమంత్‌ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>