కలం, వెబ్‌డెస్క్: నేపాల్ వరదల్లో (Nepal Floods) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు ఈ ప్రళయంలో గల్లంతైన వారిలో 30 మంది తెలుగు వారున్నారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వరదల్లో 390కి పైగా ప్రజలు మృతి చెందినట్లు నేపాల్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు 290కి పైగా భారతీయులు గల్లంతయ్యారు. ఇందులో 177 మంది భారతీయుల మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో 90 మంది అమెరికన్లు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 33 దేశాలకు చెందిన 627 మంది విదేశీయులే ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది గల్లంతవగా వీరిలో తెలంగాణ నుంచి 23 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిని, ఏపీకి చెందిన నలుగురిని రక్షణ బృందాలు కాపాడినట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

