హార్దిక్ పాండ్యాపై వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. గత మూడేళ్లలో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌గా కూడా హార్దిక్ పెద్దగా విజయవంతం కాలేదని పేర్కొన్నారు. 2026 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి చర్చ మొదలైంది.

హార్దిక్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలా? లేక ఆ బాధ్యత నుంచి తప్పించాలా? అనే విషయాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించాల్సి ఉందని జాఫర్ అన్నారు. హార్దిక్ వంటి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కూడా వదులుకోవాలని కోరుకోదని ఆయన చెప్పారు. అయితే, అతనిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా గత మూడేళ్ల ప్రదర్శన లేదని పేర్కొన్నారు. కెప్టెన్సీ నుంచి తప్పిస్తే హార్దిక్ దానిని ఎలా స్వీకరిస్తాడనేది కూడా చూడాల్సిన అంశమని జాఫర్ అభిప్రాయపడ్డారు.

అయితే హార్దిక్‌కు ఐపీఎల్‌లో ఇప్పటికీ భారీ విలువ ఉందని ఆయన అన్నారు. నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేయగలగడం, మూడు లేదా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలగడం అతని ప్రత్యేకతగా పేర్కొన్నారు. కీలక సమయాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం కూడా అతనికి ఉందన్నారు. 2024 సీజన్‌కు ముందు హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సీజన్‌లో ముంబై చివరి స్థానంలో నిలిచింది.

14 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. 2025లో ముంబై నాలుగో స్థానానికి చేరింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి ఎలిమినేటర్ వరకు వెళ్లింది. కానీ 2026లో జట్టు మళ్లీ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీతో పాటు అతని వ్యక్తిగత ప్రదర్శనపైనా ప్రశ్నలు పెరిగాయి. ఇప్పుడు హార్దిక్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేక ముంబై ఇండియన్స్ మరో నిర్ణయం తీసుకుంటుందా? అనేది మేనేజ్‌మెంట్ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>