కలం, వరంగల్ బ్యూరో: ‘బిడ్డా.. ఎంత పని చేశావే! రోజు మాదిరిగానే బస్సులో కాలేజీకి వెళ్లి, తిరిగి వచ్చి ఉంటే నీ ప్రాణాలు దక్కేవి కదా!’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని సుప్రతిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డను కోల్పోయి తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఇరుగుపొరుగు వారికి కూడా సాధ్యం కావడం లేదు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని, తమను కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకున్నామని వారు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.
వరంగల్ (Warangal) ఎల్లం బజార్‌కు చెందిన ఆకుతోట ఉమామహేశ్వర్ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఉమామహేశ్వర్‌కు ఇటీవలే గుండెపోటు రావడంతో, వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కుటుంబంలో పెద్ద బిడ్డ అయిన సుప్రతిక, హసన్‌పర్తి సమీపంలోని ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది.
సుప్రతిక ప్రతిరోజూ బస్సులోనే కాలేజీకి వెళ్లి వచ్చేది. కానీ, శుక్రవారం మాత్రం తన క్లాస్‌మేట్ అయిన అక్రమ్ బైక్‌పై హనుమకొండ వరకు వచ్చేందుకు అంగీకరించింది. అక్రమ్ ప్రతిరోజూ తన సోదరితో (అదే కాలేజీ విద్యార్థిని) కలిసి కాలేజీకి వచ్చేవాడు. అయితే శుక్రవారం ఆమె కాలేజీకి రాకపోవడంతో, చెల్లెలికి బదులుగా తన క్లాస్‌మేట్ సుప్రతికను బైక్‌పై తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. దురదృష్టవశాత్తు మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

