కలం, వనపర్తి: ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నేడు వనపర్తి రాజీవ్‌గాంధీ చౌరస్తాలోని రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, యువతతో కలిసి ఫారం-6ను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించే నిర్ణయం తీసుకున్నది రాజీవ్‌గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వమని గుర్తు చేశారు. యువతకు దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య హక్కును అందించాలన్న రాజీవ్‌గాంధీ దూరదృష్టికి ఇది నిదర్శనమన్నారు.
రాజ్యాంగంలోని 61వ సవరణ ద్వారా ఓటు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినట్లు తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధంలాంటిదని, ప్రజలు తమ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే శక్తి ఓటు ద్వారా పొందుతారని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందుతున్న యువత ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఒక్క ఓటు చిన్నదిగా కనిపించినా ప్రజల భవిష్యత్తును నిర్ణయించే గొప్ప శక్తి దానికి ఉందని చెప్పారు.
యువత దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటిదని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో యువత పాత్ర కీలకమన్నారు. రాజీవ్‌గాంధీ యువతపై ఉంచిన నమ్మకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల పరిధిలో 18 ఏళ్లు నిండిన యువతను గుర్తించి ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు హక్కుకు దూరం కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరె రాములు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఎన్ఎస్యూఐ నాయకులు శ్రీకాంత్, దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

