మునగాలలో కమ్యూనిటీ కిచెన్.. రూ.9.60 కోట్లతో ఏర్పాటు..!

కలం, సూర్యాపేట : సూర్యాపేట (Suryapet) జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మునగాల మండలంలో రూ. 9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్ (Advanced Community Kitchen) ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారి పక్కన, మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చేసిన విజ్ఞప్తి మేరకు సింగరేణి కంపెనీ సిఎస్‌ఆర్ నిధుల నుంచి రూ. 9.60 కోట్లు విరాళంగా అందించింది. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఈ కమ్యూనిటీ కిచెన్ ద్వారా జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు చెందిన సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం నాణ్యమైన, పరిశుభ్రమైన అల్పాహారాన్ని తయారు చేసి సరఫరా చేయనున్నారు.

అలాగే, అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన కొన్ని జూనియర్‌ కళాశాలలకు మధ్యాహ్న భోజనం కూడా అందించేలా ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలు, సమగ్ర ప్యాకింగ్, రవాణా వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>