కలం, వనపర్తి: దళితులకు కేటాయించిన లావణి/అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయించుకున్నారంటూ వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) మేఘారెడ్డి (Megha Reddy) పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారణైతే ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
వనపర్తి (Wanaparthy) జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, నాయకులు ఎం. రాజశేఖర్, దొడ్ల రాములు, జాతృ నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గత ఎన్నికలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేసి గెలిచారని, అయితే ఆ ఆరోపణలకు ఇప్పటివరకు ఆధారాలు చూపలేకపోయారని విమర్శించారు.
నిరాధార ఆరోపణలు చేసినట్లయితే నిరంజన్‌రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలుటూరు శివారులో జాతీయ రహదారికి సమీపంలోని సర్వే నంబర్ 517/A2లో 0.39 గుంటల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల మార్పిడి వ్యవహారంపై నాయకులు ప్రశ్నలు సంధించారు.
దళితులకు కేటాయించిన లావణి/అసైన్డ్ భూముల క్రయవిక్రయాలపై నిబంధనలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ భూమి స్వభావం, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెచ్చారంటూ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విచారణలో తేలితే సంబంధిత సబ్‌రిజిస్ట్రార్, తహశీల్దార్ తదితర అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని కోరారు.
సోలార్ ప్లాంట్ భూములపై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు
దోడగుంటపల్లి–అంకూరు గ్రామాల మధ్య సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూ లావాదేవీలపైనా నాయకులు పలు ఆరోపణలు చేశారు. ప్రథమేష్ సోలార్ ఫార్మ్‌కు చెందిన భూముల విషయంలో దళితుల లావణి పట్టా భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారంటూ వారు ఆరోపించారు. సర్వే నంబర్లు 548/A2, 548/E1, 548/E2, 548/E3, 548/E4, 548/E5లకు సంబంధించిన సుమారు 5 ఎకరాల 10 గుంటల భూమి లావాదేవీలపై అధికారులు సమగ్ర సర్వే నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నాయకులు పేర్కొన్నారు.
ఎస్పీకి ఫిర్యాదు.. కలెక్టర్‌కు వినతి
దళితుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. అదే సమయంలో ఎన్నికల అఫిడవిట్‌లో భూమి వివరాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు.
విచారణలో ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చినట్లు తేలితే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా ఈ అంశాలపై స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ పేరుతో ఈ ఆరోపణలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
ఎమ్మెల్యేకు సంబంధించిన అవినీతి, అక్రమాలపై తమ వద్ద ఉన్న అంశాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తామని కృష్ణానాయక్, రాజశేఖర్, దొడ్ల రాములు, గంధం పరంజ్యోతి, జాతృ నాయక్ హెచ్చరించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్ నాయక్, ఎద్దుల సాయికుమార్, వసంత్, జూదం వెంకటేష్, పీన్యా నాయక్, నారాయణ నాయక్, కవితా నాయక్, సర్పంచులు శోభ, రాజమ్మ, గోవిందు నాయక్, శాంతయ్య, శాంతన్న, దేవకుమార్, చైతన్య నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

