కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో ఆరేపల్లి వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన 72వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళలు, పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. విజేతలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి బహుమతులు అందజేసి అభినందించారు.
అనంతరం, బాల్ బ్యాడ్మింటన్‌లో ఐదు దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తూ రాష్ట్ర, జాతీయ, జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన సీనియర్ మాజీ క్రీడాకారుడు, గోపాల్‌పేట మండలం తాడిపర్తి సర్పంచి పేరి లోకారెడ్డిని చిన్నారెడ్డి సన్మానించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి శాలువాతో సత్కరించి బ్యాట్‌ను బహూకరించారు. బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ కనబరిచిన లోకారెడ్డి ప్రస్తుతం సర్పంచిగా సేవలు అందిస్తుండటం విశేషమని పేర్కొన్నారు.

