కలం, వనపర్తి: పాము కాటు బాధితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే తక్షణ వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Wanaparthy Collector) వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన మందులతో పాటు యాంటీ స్నేక్ వెనం (ఏఎస్‌వీ) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం వనపర్తి మండలం కడుకుంట్ల పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాము కాటు కేసులు వచ్చినప్పుడు అనుసరిస్తున్న వైద్య విధానం, ఏఎస్‌వీ నిల్వలు, వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైతే ఉన్నతస్థాయి వైద్యం కోసం తరలించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
రక్తహీనతపై ప్రత్యేక దృష్టి..
పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ (Wanaparthy Collector) సమీక్షించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. వైద్యుల సూచన మేరకు మందులు, పోషకాహారంపై అవగాహన కల్పించాలని, గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
కడుకుంట్ల (Kadukuntla) జడ్పీ ఉన్నత పాఠశాలను కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఫిజిక్స్, గణితం, ఇంగ్లిష్‌లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక మెటీరియల్‌తో బోధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా బోధించాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విద్యార్థుల క్రీడల కోసం మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ రాకేష్‌రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఏఐ పిక్స్‌తో ‘రాజకీయ రచ్చ’.. బీజేపీ vs కాంగ్రెస్!
Follow Us On: X(Twitter)

