కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ శాసనసభలో సెప్టెంబర్ 9, 2026న జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలోని పోస్టును ఆధారంగా చేసుకుని ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఆరోపించారు. ఈ మేరకు శాసనసభ నియమావళిలోని రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు.
పవిత్రమైన చట్టసభలో అవాస్తవ, నిరాధార, వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ప్రదర్శించడం ద్వారా సభా గౌరవానికి భంగం కలిగించడంతో పాటు సభ్యులను తప్పుదోవ పట్టించే పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఏర్పడిందని వారు ఆరోపించారు. నకిలీ ఎక్స్ ఖాతాలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని శాసనసభలో వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని తెలిపారు. ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.

