కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) పట్టణంలోని కల్లు దుకాణాలపై రాష్ట్ర ఈగల్ టీమ్ ఫోర్స్ (Eagle Team Force) అకస్మాత్తుగా దాడులు నిర్వహించింది. మత్తు పదార్థాలతో కల్లు కల్తీ జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో అధికారులు ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీమ్ డీఎస్పీ పుష్పక్ కుమార్ నేతృత్వంలో మొత్తం ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు, ఏకకాలంలో ముకుమ్మడిగా తూప్రాన్ పట్టణంలోని 5 కల్లు దుకాణాలపై మెరుపు దాడులు చేశారు.
ఈ సోదాల్లో భాగంగా కల్లులో కలిపేందుకు పలు మత్తు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అనుమానం రావడంతో, శాంపిళ్ల కోసం పెద్ద ఎత్తున కల్లు సీసాలను అధికారులు స్వాధీనం చేసుకుని (సీజ్ చేసి) ల్యాబ్‌కు తరలించారు. ఆ కల్లు సీసాలలో నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ఫాజోలం ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సేల్స్‌మెన్‌లుగా పనిచేస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత మత్తు పదార్థాలను కల్లులో కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

