‘సెప్టెంబరు 17’ ఘనంగా నిర్వహించాలి: బీజేపీ నేత వీరేందర్‌గౌడ్‌

కలం, వనపర్తి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబరు 17న ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్‌ (Tulla Veerender Goud) పిలుపునిచ్చారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు.

సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్‌ పోలో అనంతరం 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని వీరేందర్‌గౌడ్‌ గుర్తు చేశారు. సెప్టెంబరు 17 తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి, అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించే విమోచన దినోత్సవ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు..

సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం కూడా ఉండటంతో నెలరోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్‌’ నిర్వహించనున్నట్లు వీరేందర్‌గౌడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తలకే పరిమితం కాకుండా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. పాఠశాలల్లో ‘వికసిత భారత్‌’ అంశంపై చిత్రలేఖనం, వ్యాసరచన, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు, యువత పాత్రపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.

SIR నోటీసులను నిర్లక్ష్యం చేయొద్దు..

ప్రస్తుతం కొనసాగుతున్న SIR ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో సంబంధిత అధికారులను సంప్రదించి స్పందించాలని వీరేందర్‌గౌడ్‌ సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, నోటీసుల వివరాలను పరిశీలించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో బీజేపీ వనపర్తి జిల్లా ఇన్‌చార్జి బొక్క బాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ, సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, రామన్నగారి వెంకటేశ్వర్లు రెడ్డి, మెంటంపల్లి పురుషోత్తంరెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుజ్ఞరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు శ్రీనివాస్‌గౌడ్‌, కల్పన, జిల్లా మీడియా కన్వీనర్‌ గజరాజుల తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>