కలం, సోన్: సోన్ మండలంలోని కడ్తాల్ (Kadthal) గ్రామంలో శనివారం సర్పంచ్ గుర్రం రాము అధ్యక్షతన గ్రామసభ (Grama Sabha) నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగంలో పొదుపు పాటించాలని, ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సుమయ తస్కిన్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

