కలం, వెబ్ డెస్క్ : విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గందరగోళం చోటుచేసుకుంది. నగరంలోని 55వ డివిజన్ (Vijayawada 55th Division) బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.
55వ డివిజన్ బ్యాలెట్ పేపర్ ముద్రణలో పొరపాటు వెలుగు చూసింది. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదుట కాంగ్రెస్ పార్టీకి చెందిన ‘హస్తం’ గుర్తును ముద్రించగా, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట వైసీపీ అధికారిక గుర్తు అయిన ‘ఫ్యాన్’ గుర్తును ముద్రించారు. అయితే, ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) గతంలో విడుదల చేసిన అభ్యర్థుల అధికారిక జాబితా ‘ఫారం-11’లో గుర్తులు సక్రమంగానే కేటాయించినట్లు తెలుస్తోంది.
అధికారిక జాబితాలో సరిగ్గా ఉన్నప్పటికీ, ముద్రిత బ్యాలెట్ పేపర్లో మాత్రం గుర్తులు తారుమారు కావడం వెనుక అధికారుల ఉద్దేశపూర్వక తప్పిదం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొరపాటు కారణంగా ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్న వైసీపీ అభ్యర్థి వెంటనే రిటర్నింగ్ అధికారిని (RO) కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ను నిలిపివేసినట్లు సమాచారం.

