కలం, వెబ్ డెస్క్ : “ఓట్ బచావ్.. దేశ్ బచావో” నినాదంతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి నేడు భారీ నిరసన ర్యాలీకి శ్రీకారం చుట్టింది. ఈ ‘ఛలో ఢిల్లీ’ (Chalo Delhi Rally) కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు, ఈ సభ ద్వారా తమ శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ భారీ ప్రదర్శన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరుపై ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా ఈసీ ఎదుట మూడు కీలక డిమాండ్లను ఉంచారు. అందులో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, వివాదాస్పదంగా మారిన 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను మళ్లీ యథావిధిగా చేర్చాలని కోరారు.
మరోవైపు, ఇటీవల చర్చనీయాంశంగా మారిన SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా మళ్లీ బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని గట్టి పట్టుపట్టారు. ఈ నిరసన ర్యాలీ జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

