కలం, వెబ్ డెస్క్: తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ తక్షణం ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి (Vem Narender Reddy) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ప్రజల ఉద్యమాన్ని గౌరవించాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గమనంలోకి తీసుకుని వారిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను బీజేపీ వెనక్కి తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియను పాకిస్తాన్-ఇండియా విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన కామెంట్లు ఏ రకంగానూ సమర్ధనీయం కావని చెప్పారు. వాటిని వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలన్నారు.
తమ ఎంపీ కామెంట్లపై బీజేపీ పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పారు. యావత్తు తెలంగాణ ప్రజలకు బీజేపీ సారీ చెప్పాలన్నారు. తెలంగాణ చరిత్రను, అరవై ఏళ్ళ ప్రజల ఉద్యమాన్ని అవమానించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపేరు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే నిరసనలో వేం నరేందర్‌రెడ్డి పాలుపంచుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నీరసన చేపట్టారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. తేజస్వి సూర్య, కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ అవమానించవద్దంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనను భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గురువారం నుంచి మండిపడుతున్న విషయం తెలిసిందే.

