కలం, స్పోర్ట్స్ బ్యూరో: ప్రపంచం ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఫిఫా వరల్డ్ కప్-2026 (FIFA World Cup 2026) కు సమయం ఆసన్నమైంది. ఈ ఫైనల్ కేవలం ట్రోఫీ పోరు మాత్రమే కాదు.. ఎన్నో కొత్త రికార్డులు, ప్రత్యేకతలకు వేదిక కానుంది. ఇది ఫిఫా చరిత్రలోనే అతిపెద్ద ప్రపంచకప్. మొదటిసారి 48 జట్లు బరిలోకి దిగాయి. గతంలో 32 జట్లు మాత్రమే ఆడేవి. ఈసారి టోర్నీ మూడు దేశాల్లో జరిగింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ప్రపంచకప్ మ్యాచ్లు మొత్తం 16 ఆతిథ్య నగరాల్లో జరిగాయి.
దద్దరిల్లిపోయేలా క్లోజింగ్ సెర్మనీ
ఫైనల్‌కు ముందు జరిగే క్లోజింగ్ సెర్మనీ ఈసారి మరో ఆకర్షణ. ప్రపంచ ప్రఖ్యాత గాయకులు రాబీ విలియమ్స్, లారా పౌసిని, నికోల్ షెర్జింగర్, ఐషోస్పీడ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ కూడా ప్రత్యేకంగా హాజరుకానున్నారు. అమెరికా జాతీయ గీతాన్ని ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డు గ్రహీత జెన్నిఫర్ హడ్సన్ ఆలపించనున్నారు.
ప్రైజ్ మనీ ఎంతంటే?
ఈసారి ప్రైజ్ మనీ కూడా రికార్డు స్థాయిలో ఉంది. మొత్తం ప్రైజ్ పూల్‌ను ఫిఫా భారీగా పెంచింది. ప్రపంచ ఛాంపియన్ జట్టుకు 50 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.430 కోట్లకు పైగా) అందనున్నాయి. ప్రైజ్ మనీతో పాటు ప్రపంచ ఫుట్ బాల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీ లభిస్తుంది. మొత్తం టోర్నీలో పాల్గొన్న జట్లకూ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులు అందుతాయి. 48 జట్లతో నిర్వహించిన తొలి ప్రపంచకప్‌కు ఇదే ముగింపు మ్యాచ్. అందుకే ఈ ఫైనల్‌కు చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ఫార్మాట్ ఎంత విజయవంతమైందో కూడా ఈ టోర్నీతో స్పష్టమవుతుంది.
రికార్డుల వర్షం
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఎక్కువ జట్లు, ఎక్కువ మ్యాచ్‌లు, ఎక్కువ మంది అభిమానులు. ఫుట్‌బాల్‌లో చిప్ టెక్నాలజీతో పాటు పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఈసారి విస్తృతంగా వినియోగించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ను మరింత విస్తరించిన టోర్నీగా ఇది గుర్తింపు పొందింది. ఇప్పుడు అందరి చూపు ఫైనల్‌పైనే ఉంది. ఎవరు ఛాంపియన్ అవుతారు? ఎవరు ట్రోఫీ ఎత్తుతారు? చరిత్రలో నిలిచే ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.

