Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ వాసులకు శుభవార్త

కలం, కరీంనగర్ బ్యూరో: ఎలగందుల పెద్ద చెరువు అభివృద్ధికి రూ.10 లక్షలతో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులు చేపడతామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Elgandal Lake)  తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

కొత్తపల్లి మండలం ఎలగందులలోని పెద్ద చెరువును బుధవారం వెలిచాల రాజేందర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చెరువు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించినట్టు పేర్కొన్నారు.

చెరువు పూడికతీత, సిల్ట్ తొలగింపు, తూము మరమ్మతు పనులు చేపడతామని వెల్లడించారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగునీరు మరింత అందుబాటులోకి వస్తుందని అన్నారు. చెరువు అభివృద్ధితో మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేలా చెరువు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఈ విషయమై సాగునీటి శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, స్థానిక సర్పంచ్ నిమ్మల అంజన్న, ఉపసర్పంచ్ గసిగంటి కుమార్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం

2016లో ప్రారంభమైన ఎలగందుల బ్రిడ్జి నిర్మాణం వివిధ కారణాలతో ఆలస్యమైందని, పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారంతో పనులను వేగవంతం చేసి త్వరలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.

ఎలగందులలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను వెలిచాల రాజేందర్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 2016లో ప్రారంభమయ్యాయని, 2022లో మరో ఒప్పందం ద్వారా వేర్వేరు కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్ – వేములవాడ మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. కరీంనగర్‌కు త్వరగా చేరుకునేందుకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని రాజేందర్ రావు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>