కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో నిర్వహించనున్న రెండో విడత భారత్ సమ్మిట్ పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు (V Hanumanth Rao) తీవ్ర విమర్శలు చేశారు. భారత్ సమ్మిట్ వెనుక రాజకీయ కుట్ర ఉంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారని మండిపడ్డారు. యావత్ దేశాలు నుండి ఇక్కడ పెట్టుబడులు కోసం వస్తుంటే.. అది కుట్ర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. విదేశాలు నుండి వచ్చే వాళ్ళు ఏమైనా తనకుఓట్లు వేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు.
భారత్ సమ్మిట్ (Bharat Summit) నిర్వహించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఏముంటుందని వీహెచ్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ చేస్తుందని.. విదేశాల నుండి వచ్చే వాళ్ళుకి ఓట్లు ఇస్తారా అంటూ దుయ్యబట్టారు. బీసీలపై బీజేపీ నేతలది కపటప్రేమ అని.. బీసీలకి న్యాయం జరిగితే రాహుల్ గాంధీ ఎక్కడ ప్రధాని అవతాడోనని బీజేపీ భయపడుతుందని విమర్శించారు. అందుకే ఓబీసీ కాలం పెట్టకుండా కేంద్రం సెన్సెస్ చేస్తుందని మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీసీల ఓట్లు కావాలి కానీ.. బీసీలకు న్యాయం మాత్రం చెయ్యరు అంటూ వీహెచ్ ఘాటుగా మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఏమైనా విడగొట్టమన్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ మతం పేరుతో ఎందుకు రాజకీయాలు చేస్తుందని నిలదీశారు.

