కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ (Uppal Flyover) పనుల్లో జరుగుతున్న విపరీతమైన ఆలస్యం కారణంగా స్వల్ప వర్షానికే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా చేరిన వరద నీటి వల్ల వాహనదారులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 2018 జూలైలో ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ పనులు గడిచిన ఎనిమిదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. దీంతో స్థానికులతో పాటు ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తామని మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వేగం చూస్తుంటే 2027 దసరా నాటికి కూడా ఇది అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. పాలకులు, అధికారుల ఉదాసీనతపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

