కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల (Rains) కు లక్ష్మణచందా మండలం పీచర, ధర్మారం గ్రామాల నుంచి సోన్ మండలం వైపు వెళ్లే ప్రధాన రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహనాలను వెల్మల్, బొప్పారం మీదుగా మళ్లించారు.
గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో భారీ వర్షాలకు రహదారి దెబ్బతినగా, మరమ్మతులు చేపట్టినప్పటికీ ఈసారి మళ్లీ రోడ్డు కొట్టుకుపోవడంపై స్థానికులు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిచ్చాయి. వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంటలకు ఈ వర్షాలు ఉపయోగపడనున్నాయి. అయితే మరో రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

