కరీంనగర్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్.. ‘కోడళ్ల’ ఎంట్రీ

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు, ముందస్తు వ్యూహాలు కొత్తేమీ కాదు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు సీనియర్ నేతలు అనుసరిస్తున్న కొత్త వ్యూహం (Daughter-in-Law Strategy) ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజకీయ వారసులుగా కొడుకులు, సోదరులను రంగంలోకి దించే నేతలు.. ఈసారి అందుకు భిన్నంగా కోడళ్లను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది.

భవిష్యత్‌లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల రిజర్వేషన్లలో మార్పులు జరిగితే తమ రాజకీయ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సీనియర్ నేతలు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ తమ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అయితే లేదా ఇతర కారణాలతో తాము పోటీ చేయలేని పరిస్థితి వస్తే.. కుటుంబం నుంచే ప్రత్యామ్నాయ అభ్యర్థిని సిద్ధం చేయాలన్న ఆలోచన ఇందులో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు తమ కోడళ్లను రాజకీయంగా యాక్టివ్ చేస్తూ, నియోజకవర్గాల్లో ప్రజలతో సంబంధాలు పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారనే చర్చ ఉంది.

హుజూరాబాద్ – ఈటల క్షమితా రెడ్డి (ఈటల రాజేందర్ కోడలు)

హుజూరాబాద్ నియోజకవర్గంతో బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఇక్కడ బలమైన క్యాడర్, రాజకీయ పట్టు ఉంది. ప్రస్తుతం ఈటల రాజేందర్ కోడలు ఈటల క్షమితా రెడ్డి పేరు హుజూరాబాద్ రాజకీయాల్లో వినిపిస్తోంది. మామ రాజకీయ అనుభవాన్ని దగ్గరగా గమనిస్తూ ఆమె నియోజకవర్గ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాడర్ సమన్వయం, ప్రచార వ్యూహాలపై అవగాహన పెంచుకుంటున్న ఆమె భవిష్యత్‌లో రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశాలపై చర్చ సాగుతోంది.

జగిత్యాల – చరిష్మా రెడ్డి (జీవన్ రెడ్డి కోడలు):

జగిత్యాల రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కోడలు చరిష్మా రెడ్డి కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాజకీయ వ్యవహారాలను దగ్గరగా గమనిస్తూ సోషల్ మీడియా, ఇతర ముఖ్య కార్యకలాపాల్లో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో మహిళా రిజర్వేషన్ల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారితే చరిష్మా రెడ్డి పేరు పరిశీలనలోకి రావచ్చన్న చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారం, గ్రౌండ్ లెవల్ మేనేజ్‌మెంట్‌పై ఆమె దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

పెద్దపల్లి – దాసరి మమతా రెడ్డి (దాసరి మనోహర్ రెడ్డి కోడలు)

పెద్దపల్లి మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇప్పటికే తన కోడలు దాసరి మమతా రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన ఆమె అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవంతో పాటు నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధిష్టానం అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెను బరిలోకి దించే ఆలోచనలో దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

‘కోడళ్ల రాజకీయానికి’ భవిష్యత్‌లో ఎంత పట్టు?

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో రాజకీయ వారసత్వాన్ని కుటుంబంలోనే కొనసాగించేందుకు ఈ సీనియర్ నేతలు ముందస్తుగా కోడళ్లను సిద్ధం చేస్తున్నారనే చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎన్నికల మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమస్యలపై అవగాహన, క్యాడర్ సమన్వయం వంటి అంశాల్లో ఇప్పటికే వీరు అనుభవం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ‘కోడళ్ల రాజకీయం’ రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది? మామల రాజకీయ వారసత్వాన్ని వీరు ఎంతవరకు నిలబెడతారు? ప్రత్యర్థుల వ్యూహాలను ఏ మేరకు ఎదుర్కొంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>