Mobile Popup Ad
Mobile Popup Ad

బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి: మంత్రి పొన్నం

కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపిందని, తాము అడిగినవి ఏ ఒక్కటీ ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన, నర్సంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు అయూబ్, అశోక్ గౌడ్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరూ ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం వివక్షపూరితంగా కాకుండా, న్యాయబద్ధంగా నిధులు కేటాయిస్తుందని ఆశగా ఎదురుచూశారని, కానీ కేంద్రం మరోసారి వివక్ష చూపిందని ఆయన విమర్శించారు. గత ఏడాది కేంద్రం తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు శాసనసభ వేదికగా నిలదీసినట్లు గుర్తు చేశారు.

రాష్ట్రానికి కావలసిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రమని, దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ పార్టీలకతీతంగా అభివృద్ధిలో ముందున్నట్లు వివరించారు. హైదరాబాద్ అన్ని రకాల వాతావరణాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు, భూగర్భ వనరులు, ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డును, అలాగే రింగ్ రోడ్డుకు – రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య రోడ్ల అభివృద్ధికి నిధులు అడిగామని, కానీ కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ అభివృద్ధికి నిధులు అడిగాం..

ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించడం పట్ల తాము అభ్యంతరం చెప్పడం లేదని, కానీ తెలంగాణ చిన్న వయసు గల రాష్ట్రమని గుర్తించాలని కోరారు. గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం కేంద్రంతో సయోధ్య లేకుండా, రావాల్సిన వాటిని అడగలేకపోయిందని విమర్శించారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా వివక్ష చూపుతున్నారని అన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే ప్రధాని, కుంభమేళా వంటి మేడారం జాతరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకుండా, తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని గతంలో విమర్శించి అవమానించినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) నిలదీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>