కలం, కరీంనగర్ బ్యూరో : గడువు ముగిసిన నాసిరకం సరుకులను వినియోగిస్తూ పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్న కరీంనగర్ (Karimnagar) లోని విజయపురి ఎస్టి బాయ్స్ హాస్టల్ వార్డెన్ పై చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోడా మోహన్ నాయక్, భీమా సాహెబ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు ప్రకాష్ నాయక్, రమేష్, శ్రీనివాస్ లతో కలిసి శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గిరిజన బాలుర హాస్టల్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా పిల్లలతో కలిసి గిరిజన సంఘం నాయకులు భోజనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గడువు ముగిసిన జీలకర్ర తదితర సరుకులను వంటలో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే మెనూ ప్రకారం పిల్లలకు సరిపోను భోజనం అందించడం లేదని పిల్లలు వాపోయారు. 120 మంది పిల్లలకు కేవలం నాలుగు లీటర్ల పాలు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.
నీళ్ల చారు, అధిక మొత్తంలో నీళ్లు కలిపిన మజ్జిగ పిల్లలకు పెడుతున్నట్లు చెప్పారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనంలో రెండు రకాల కూరలు వడ్డించాల్సి ఉండగా కేవలం ఒకే రకం కూర పెడుతున్నారన్నారు. పిల్లలకు బిల్లు యూనిఫామ్స్ ఇప్పటివరకు అందించలేదన్నారు. అలాగే పీఈటి టీచర్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండటంవల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ పాఠశాలను పదో తరగతి వరకు అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి వరకు లేని మూలంగా చాలామంది గిరిజన విద్యార్థులు డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

