కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి (Lakshmidevipally) పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసు (Traffic Constable Assault)లో భార్యాభర్తలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 16వ తేదీన ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద హోటల్ నిర్వహిస్తున్న సింధూరపు శోభన్, అతని భార్య మంజుల కలిసి ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్గం విజయ్ కుమార్ పై పైపులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని భద్రాచలం సబ్ జైలుకు తరలించి రిమాండ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

