కలం, జోగులాంబ గద్వాల: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేటుకు ధీటుగా మెరుగైన వైద్య సేవలు అందించి సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) వైద్య అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది పనిచేయకుంటే ప్రయోజనం లేదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు చేయకుండా ఇతర ఆసుపత్రులకు ఎక్కువగా రెఫరల్ చేస్తుండడాన్ని గుర్తించినట్లు తెలుపుతూ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ సెంటర్స్ సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
హై రిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే హై రిస్క్ కేసులను ప్రైవేటుకు రెఫర్ చేయకుండా సాధ్యమైనంత వరకు అక్కడే సేవలు అందించడం లేదా సమీపంలోని జిల్లా ఆసుపత్రులకు పంపించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్సీల సిబ్బంది నిర్లిప్తంగా ఉండడం సరికాదన్నారు. గట్టు లాంటి మారుమూల ప్రాంతాల గర్భిణీలు డెలివరీ కోసం గద్వాల వరకు వచ్చే పరిస్థితులు ఉండరాదు అంటే అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవాలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారని, సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
త్వరలోనే ఆసుపత్రుల తనిఖీ..
వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, త్వరలోనే గట్టులో ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అనీమియా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి తగు చికిత్స అందజేయాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున రైతులు ఇబ్బందులు పడ్డారని ఈ ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు వైద్య సేవలను ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందేలా పనిచేయాలని సూచించారు. ఆర్థిక సమస్యలతో బాధపడే జనం ప్రైవేట్ ఆసుపత్రిలలో చికిత్స పొందడం తలకు మించిన భారము అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు కార్డులు..
ఇమ్యునైజేషన్ సేవలు, ఇతర వైద్య సంబంధ కార్యక్రమాలను సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా తనిఖీలను పెంచాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య పాఠశాల పేరుతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా కార్డులను అందజేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు 7,388 మంది విద్యార్థులకు ఈ కార్డులను అందజేసి పలు పరీక్షలు చేశామన్నారను. అడోలెస్ ఫ్రెండ్లీ హెల్త్ సెంటర్స్ సేవలను విస్తృతపరచాలని, కౌమారదశ పిల్లలకు సంబంధిత అంశాలపై తరచూ కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో డీహెచ్ఎంవో సంధ్య కిరణ్మయి, ఇతర వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

