నూతన చట్టాలపై ఖమ్మం పోలీసులకు శిక్షణ

​కలం, ఖమ్మం బ్యూరో : ప్రజా పోలీసింగ్‌కు కొత్త దిశ చూపేలా, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఖమ్మం పోలీస్ (Khammam Police) కమిషనరేట్ ఆధ్వర్యంలో నూతన క్రిమినల్ చట్టాలపై ప్రత్యేక అవగాహన శిక్షణ నిర్వహించారు. సీటీసీ (సిటీ ట్రైనింగ్ సెంటర్)లో 500 మంది సిటీ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ అధికారులు, సిబ్బందికి గత వారం రోజులుగా అందించిన ఈ శిక్షణ శుక్రవారం ముగిసింది.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమం (BSA) చట్టాలపై ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.

​ఈ శిక్షణలో భాగంగా కేసులు నమోదు, దర్యాప్తు విధానం, డిజిటల్, ఎలక్ట్రానిక్ ఆధారాల సేకరణ, బాధితుల హక్కుల పరిరక్షణ, అరెస్టు-రిమాండ్ ప్రక్రియలు, కోర్టు విచారణ వంటి అంశాలపై నిపుణులు స్పష్టమైన అవగాహన కల్పించారు. శాస్త్రీయంగా, పారదర్శకంగా కేసుల విచారణ జరిపి దర్యాప్తు నాణ్యతను పెంచడం ద్వారా బాధితులకు వేగంగా న్యాయం అందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీటీసీ ఏసీపీ హరినాథ్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>