కలం, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీ సీనియర్ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో మెంబర్ మిసిర్ బెస్రా (Misir Besra)ను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కేంద్ర కమిటీలో గణపతి, మిసిర్ బెస్రా మినహా మిగిలినవారంతా లొంగిపోవడమో లేక చనిపోవడమో జరిగిందని కేంద్ర హోంశాఖ గతంలోనే ప్రకటించింది.
ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ పోలీసులు ధన్‌బాద్ (Dhanbad) జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేశారు. ఆయన కదలికలకు సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి రూపాయలకంటే ఎక్కువే బహుమతి ఇస్తామని జార్ఖండ్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ధన్‌బాద్-గిరిధ్ సరిహద్దులోని టుండీ-మండియా అటవీ ప్రంతంలో భద్రతా బలగాల ఆపరేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పట్టుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.
ఇరవై ఏండ్ల తర్వాత పట్టుకున్నాం :
పారస్నాధ్ ఆలయ పర్వత ప్రాంతంలో సహచరులతో కలిసి గత కొంతకాలంగా ఉంటున్నట్లు సమాచారం వచ్చిందని, భారీ బలగాలను మోహరించామని, ఈ సమాచారం తెలుసుకుని పారపోయేందుకు ప్రయత్నించారని, చివరకు తమ చేతికి చిక్కారని జార్ఖండ్ (Jharkhand) పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. గతంలో ఆయనతో పాటు ఉన్న సహచరుల్లో కొందరు పోలీసులకు లొంగిపోయారని, వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఈ పర్వత ప్రాంతంలో బలగాలను మోహరించినట్లు వివరించారు.
పోలీసు వర్గాల నుంచి అరెస్టు విషయం బయటకు రాగా మిసిర్ బెస్రా (Misir Besra) కుమారుడు సిద్ధార్థ్ బెస్రా మాత్రం తమకు ఇప్పటివరకు అఫీషియల్‌గా అరెస్టుకు సంబంధించిన సమాచారం రాలేదని మీడియాకు తెలిపారు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా తన తండ్రిని చూడలేదని పేర్కొన్నారు. నిజంగా పోలీసులు చెప్తున్న సమాచారం వాస్తవమే అయితే ఎన్కౌంటర్ కాకుండా సజీవంగా ఉండడం సంతోషమేనని అన్నారు.
Read Also: గుండు చేసుకుంటే డబ్బు.. తమిళనాడులో ఘరానా మోసం!
Follow Us On: Instagram

