Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజల సొమ్ము బాధ్యతగా ఖర్చు చేయాలి : మంత్రి తుమ్మల

కలం/ఖమ్మం బ్యూరో : ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Nageswara Rao) తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో కొత్త సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళలు స్థానిక సంస్థల ఫలితాలలో ఎక్కువ శాతం విజయం సాధించారని గుర్తు చేశారు.

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు అందించిన శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Nageswara Rao) తెలిపారు. ప్రజల సొమ్ము న్యాయబద్దంగా ఖర్చు చేయాలని, ఊరిలో ఉన్న చెరువు కాపాడుకుంటూ చేపలు పెంచడం ద్వారా లక్షలసంపద సృష్టించవచ్చన్నారు. రోడ్ల వెంబడి కొబ్బరి చెట్లు పెంచి వాటి ద్వారా ఆదాయం సంపాదించే గ్రామ పంచాయతీలు కూడా మన దేశంలో ఉన్నాయని, సొంత ఆదాయ మార్గాలు పెంచుకోవాలని సూచించారు. ఉచితాల వల్ల ప్రయోజనం రాదని, ప్రజలను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు.

ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనులు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. సర్పంచ్ బాధ్యతగా పని చేస్తే గ్రామాలు బాగుపడతాయని.. ఖమ్మం జిల్లాలో ప్రజలకు మౌళిక వసతుల కల్పన కోసం పదవిలో ఉన్నా లేకపోయినా తాను కృషి చేస్తానని తెలిపారు. రోడ్లు విస్తరించాలని చెబితే తనను రెండుసార్లు ఓడించారని.. అయినా సరే అడవుల సంరక్షణ, రోడ్ల విస్తరణకు తాను కట్టుబడి ఉంటానని, దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేశానని తెలిపారు. వచ్చే జూన్ నాటికి జిల్లాలో 5 నియోజకవర్గాలకు గోదావరి జలాలు తరలిస్తామని తెలిపారు.

నీటి పారుదలకు సంబంధించిన కాల్వల పనులకు రైతులు అడ్డుపడితే స్థానిక ప్రజాప్రతినిధులు సముదాయించి పనులు జరిగేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న వైద్యశాలలు, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటూ అక్కడ పనిచేసే సిబ్బంది సమయానికి వచ్చేలా చూడాలని మంత్రి సూచించారు. నూతన తహసిల్దార్ కార్యాలయాలు, పంచాయతీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దశల వారీగా నిధులు వస్తాయని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రకృతివనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టి వినియోగంలోకి తీసుకుని రావాలని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>