​ఖమ్మం వరద ముంపున‌కు శాశ్వత పరిష్కారం: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరాన్ని వరద ముంపు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. సోమవారం నగరంలో ముమ్మరంగా సాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం నగర వాసులకు వరద గండం లేకుండా సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేశామని తెలిపారు.

గతంలో ఖానాపురం చెరువు అలుగు పారి వరద నీరు పోటెత్తడంతో అనేక డివిజన్లు తీవ్రంగా ముంపునకు గురయ్యాయని మంత్రి గుర్తు చేశారు. ఆ ప్రతికూల పరిస్థితులు పునరావృతం కాకుండా వర్షాల వరద నీటిని సురక్షితంగా తరలించేందుకు రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

​అదేవిధంగా ఖమ్మం నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు ముమ్మరం చేశామని మంత్రి తెలిపారు. ఒకవేళ కృష్ణా నది నీళ్ల సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలతో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇందు కోసం ఇప్పటికే గోదావరి జలాలను మున్నేరు వరకు విజయవంతంగా తరలించామని ఆయన స్పష్టం చేశారు.

​నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.200 కోట్ల వ్యయంతో అమృత్ పథకం పనులు వేగంగా సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఆటోమేషన్ విధానం ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం అభివృద్ధికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీటి పథకాల మంజూరుకు పూర్తి స్థాయిలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ​ఈ పరిశీలన కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రంజిత్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>